Advertisement

మోదీ సర్కార్ మరో సంచలనం... 43 యాప్‌లపై నిషేధం...!

By: Anji Tue, 24 Nov 2020 11:00 PM

మోదీ సర్కార్ మరో సంచలనం... 43 యాప్‌లపై నిషేధం...!

భారత్, చైనా సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో సమాచార గోప్యత దృష్ట్యా ఇప్పటికే 177 యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం ప్రభుత్వం.. తాజాగా మరికొన్ని మొబైల్‌ యాప్‌లపై కొరడా ఝుళిపించింది.

దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత దృష్ట్యా చైనా నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న మరో 43 మొబైల్‌ అప్లికేషన్ల (యాప్స్)పై మోదీ సర్కార్ చర్యలు చేపట్టింది.

కేంద్ర హోం శాఖతో చర్చించిన అనంతరం ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ ఈ యాప్‌లపై నిషేధం విధించినట్లు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది.

భారత్‌లో తాజాగా నిషేధించిన వాటిలో అలీ ఎక్స్‌ప్రెస్‌, స్నాక్‌ వీడియో, మ్యాంగో టీవీ ఉన్నాయి. ఐటీ చట్టం 69 ఏ సెక్షన్‌ ప్రకారం కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ ఈ చర్యలు తీసుకుందని కేంద్రం తెలిపింది.

తాజాగా నిషేధించిన యాప్‌లలో చైనా రిటైల్‌ దిగ్గజ కంపెనీ అలీ బాబా గ్రూప్‌నకు చెందిన నాలుగు యాప్‌లతో పాటు ఆ దేశానికి చెందిన మరికొన్ని యాప్‌లు కూడా ఉన్నాయి.

గల్వాన్ లోయ వద్ద దుందుడుకు చర్యలకు దిగిన చైనాకు బుద్ధిచెప్పేందుకు జూన్‌ 29న ఆ దేశానికి చెందిన టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం.. సెప్టెంబర్ 2న పబ్జీతో పాటు 118 యాప్‌లపై నిషేధం ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

Advertisement