Advertisement

24గంటల్లో 4లక్షల కోవిడ్ టెస్టులు

By: Dimple Sun, 30 Aug 2020 2:06 PM

24గంటల్లో 4లక్షల కోవిడ్ టెస్టులు

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను ఆయా ప్రభుత్వాలు ముమ్మరం చేశాయి. దేశవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా నిత్యం దాదాపు 8నుంచి 10లక్షల శాంపిళ్లకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 10లక్షల 55వేల శాంపిళ్లకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. రోజువారీగా పదిలక్షల టెస్టులు చేయడం ఇది రెండోసారి. ఆగస్టు 21వ తేదీన ఒక్కరోజే 10లక్షల 23వేల పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆగస్టు 29వరకు దేశంలో మొత్తం 4కోట్ల 14లక్షల (4,14,61,636) శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది. ప్రస్తుతం కరోనా కేసుల పాజిటివిటీ రేటు 8.5శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దాదాపు 1600 కొవిడ్‌ నిర్ధారణ కేంద్రాలు..
దేశంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు టెస్టుల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరాన్ని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సూచిస్తోంది. దీనిలోభాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధారణ కేంద్రాలను భారీగా పెంచింది. జనవరి 23వరకు దేశంలో ఒకేఒక్క టెస్టింగ్‌ కేంద్రం ఉండగా మార్చి 23వరకు ఆ సంఖ్య 160కు పెంచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు 1583 కేంద్రాలకు ఐసీఎంఆర్‌ అనుమతినిచ్చింది. వీటిలో 1003 ప్రభుత్వ ల్యాబ్‌లు ఉండగా, 580 ప్రైవేటు ల్యాబ్‌ల ఆధ్వర్యంలో కొవిడ్‌ టెస్టులు చేపడుతున్నారు.అమెరికా తర్వాత భారత్‌..
ప్రపంచంలో అత్యధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే 8కోట్ల మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అధిక టెస్టులు చేస్తోన్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉన్నట్లు ట్రంప్‌ పలుసార్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు భారత్‌లో 4 కోట్లకు పైగా కొవిడ్‌ టెస్టులు పూర్తి చేశారు. రష్యాలోనూ భారీగా కొవిడ్‌ టెస్టులు చేపడుతున్నారు. ఇప్పటికే అక్కడ 3.6కోట్లు టెస్టులు చేసినట్లు సమాచారం. బ్రిటన్‌, జర్మనీ దేశాల్లో కోటి చొప్పున కొవిడ్‌ పరీక్షలు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక కరోనా వైరస్‌కు మూలకారణమైన చైనాలో ఇప్పటి వరకు 9కోట్ల మందికి కొవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు అక్కడి మీడియా పేర్కొన్నప్పటికీ చైనా ప్రభుత్వం అధికారిక ప్రకటన మాత్రం లేదు.

Tags :
|
|

Advertisement