Advertisement

చైనాలో మళ్ళీ కరోనా ప్రకంపనలు

By: Sankar Tue, 16 June 2020 8:09 PM

చైనాలో మళ్ళీ కరోనా ప్రకంపనలు



చైనా రాజధాని బీజింగ్‌లో ప్రాణాంతక కరోనా వైరస్‌ మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 27 మందికి మహమ్మారి సోకిందని.. దీంతో ఐదురోజుల్లోనే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 106కు చేరిందని స్థానిక ప్రభుత్వాధికారి వెల్లడించారు. వైరస్‌ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోందని.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదరు అధికారి మాట్లాడుతూ.. రాజధానిలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చిందన్నారు. ఈ నేపథ్యంలో టాక్సీ ప్రయాణాలపై రవాణా కమిషన్‌ నిషేధం విధించినట్లు వెల్లడించారు.

ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో 276 వ్యవసాయ మార్కెట్లు, 33 వేల ఫుడ్‌, బేవరేజ్‌ సంస్థలను డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేశామని తెలిపారు. వైరస్‌ ఆనవాళ్లు గుర్తించిన మార్కెట్‌కి దగ్గర్లో ఉన్న 11 నివాస సముదాయాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించామని.. తాజాగా మరో ఏడింటిని కూడా లాక్‌డౌన్‌ చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా పట్టణవ్యాప్తంగా ఉన్న అన్ని ఫుడ్‌ మార్కెట్లలోని దుకాణాల యజమానులు, రెస్టారెంట్‌ మేనేజర్లు, ప్రభుత్వ క్యాంటీన్లలో పనిచేసే వారందరికీ కోవిడ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

కాగా బీజింగ్‌లోని అతిపెద్ద హోల్‌సేల్‌ ఫుడ్‌ మార్కెట్‌ షిన్‌ఫాడి‌లో మరోసారి కరోనా ఆనవాళ్లు బయడపడటంతో అధికారులు అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్వీయ నిర్బంధంలో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బీజింగ్‌లో రోజుకు 90,000 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు నగర ఆరోగ్య కమిషన్‌ అధికార ప్రతినిధి గువా షియాజన్‌ సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. లక్షణాలు కనిపించకున్నా కరోనా పాజిటివ్‌గా నమోదైన వారిని క్వారంటైన్‌లో ఉంచినట్టు తెలిపారు.

Tags :
|
|

Advertisement