Advertisement

23 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌

By: Dimple Wed, 26 Aug 2020 11:24 PM

23 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌

పంజాబ్‌ లో ఇప్పటివరకు 23 మంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారని ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తెలిపారు. మరో రెండు రోజుల్లో(ఆగష్టు 28) అసెంబ్లీ సమావేశం జరుగనున్న నేపథ్యంలో మొత్తం 117 మంది ఎమ్మెల్యేలకు కరోనా టెస్టులు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కరోనా నెగటివ్‌ రిపోర్టు చూపించిన తర్వాతే అసెంబ్లీలో ప్రవేశించేందుకు వీలు ఉంటుందని స్పష్టం చేశారు.

కరోనా పరిస్థితులపై ఏడుగురు ఎన్డీయేతర ముఖ్యమంత్రులతో కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అమరీందర్‌ సింగ్‌ ఈ మేరకు తమ రాష్ట్రంలోని పరిస్థితుల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో 23 మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉందంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులో ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు’’ అని వ్యాఖ్యానించారు.

కోవిడ్‌ బారిన పడిన పంజాబ్‌ మంత్రులు

రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి- త్రిప్త్‌ రాజేందర్‌ బజ్వా(ప్రస్తుతం కోలుకున్నారు)
జైళ్లు, సహకార శాఖ మంత్రి- సుఖ్‌జిందర్‌ సింగ్‌ రాంధ్వా
రెవెన్యూ మంత్రి- గుర్‌ప్రీత్‌ కంగర్‌
పరిశ్రమల శాఖా మంత్రి- శ్యామ్‌ సుందర్‌ అరోరా
వీరితో పాటు విధాన సభ స్పీకర్‌ అజైబ్‌ సింగ్‌ భాటీ, అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు పర్గాత్‌ సింగ్‌, మదన్‌లాల్‌ జలాల్‌పూర్‌, హరిదయాళ్‌ కాంబోజ్‌లకు కరోనా సోకింది.

రేపు సాయంత్రానికి పూర్తి వివరాలు: స్పీకర్‌
ఇక ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు మంజీత్‌ సింగ్‌ బిలాస్‌పూర్‌, కుల్వంత్‌ సింగ్‌ పండోరిలకు మంగళవారం కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆప్‌ రెబల్‌ ఎమ్మెల్యే నజర్‌ సింగ్‌ మన్‌సాహియా కూడా కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు శిరోమణి అకాలీదళ్‌ పార్టీకి చెందిన మన్‌ప్రీత్‌ సింగ్‌ అయాలీ, కన్వర్‌జిత్‌ సింగ్‌ రోజీ బర్కందీ, లఖ్‌బీర్‌ సింగ్‌ లోధినాంగల్‌, హరీందర్‌ పాల్‌ సింగ్‌ చందుమజ్రా, గుర్‌ప్రతాప్‌ సింగ్‌ వడాలాలకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యేల్లో ఎంత మంది ప్రస్తుతం కరోనాతో బాధ పడుతున్నారనే విషయం గురువారం వెల్లడి కానుందని స్పీకర్‌ రాణా కేపీ సింగ్‌ తెలిపారు.

Tags :
|
|

Advertisement