Advertisement

10 వేల రూపాయలు తక్షణ సహాయం మాత్రమే...!

By: chandrasekar Wed, 21 Oct 2020 6:43 PM

10 వేల రూపాయలు తక్షణ సహాయం మాత్రమే...!


సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌, పరిసరాల్లో వరద బాధిత కుటుంబాలకు 3-4 లక్షల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా పాడైన వారికి అదనపు పరిహారం అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పది రోజులపాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ, పునరుద్ధరణ చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో వరద సహాయక చర్యలకు సంబంధించి మంగళవారం ప్రగతిభవన్‌లో జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. వచ్చే పది రోజులు ప్రతి ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లో నగదు సాయం అందిస్తూనే.. సహాయక చర్యలు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన శిబిరాలను పరిశీలించి.. అక్కడి వసతులు, సహాయక చర్యలను పరిశీలించాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదో చూడాలని తెలిపారు. శానిటేషన్‌ డ్రైవ్‌ను పర్యవేక్షించాలన్నారు. వరద బాధితుల సహాయార్థం గ్రేటర్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ రెండు నెలల వేతనం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని కేటీఆర్‌ అభినందించారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో కేటీఆర్‌ ప్రతి ఎమ్మెల్యేని వారి వారి నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సాయం ప్రతి ఒక్కరికీ అందాలని స్పష్టం చేశారు. పక్కదారి పట్టకుండా చూడాలని, అలాగైతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అన్నారు. ఈ క్రమంలో సాయం అందించిన వారి ఆధార్‌ వివరాలు తీసుకోవాలని ఓ ఎమ్మెల్యే సూచించగా.. కేటీఆర్‌ దానికి ఆమోదం తెలిపారు.

అనంతరం ఆయన ఖైరతాబాద్‌లోని ఎంఎస్‌ మక్తా, షేక్‌పేట, నదీం కాలనీ, నాగోల్‌, లింగోజిగూడలో ముంపు బాధిత కుటుంబాలను పరామర్శించారు. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రూ.10 వేల తక్షణ సాయాన్ని నగదు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. వరద బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, వారి కోసం అవసరమైనన్ని నిధులు ఖర్చు చేస్తామని చెప్పారు. నగరంలో బాధితులందరికీ సహాయం అందిస్తామన్నారు. అధికారులు బాధితుల ఇళ్ల వద్దకే వచ్చి నగదు ఇస్తారన్నారు. విపత్కర సమయంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, ఎన్‌జీవోలు కలిసి ప్రజలకు సాయం అందించడంలో ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో భరోసా నింపేందుకే కాలనీల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. నగరంలో రాబోయే ఒకట్రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వరద నివారణకు శాశ్వత పరిష్కారాల కోసం ప్రయత్నం చేస్తామన్నారు. కాగా.. వర్షాలు, వరద బీభత్సం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వాయిదా పడతాయా అన్న ప్రశ్న వచ్చినప్పుడు షెడ్యూల్‌ ప్రకారమే జరిగే అవకాశం ఉందని కేటీఆర్‌ అన్నట్లు తెలిసింది. నగరంలో వరదల వల్ల అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో.. తాజాగా కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయం చేయడంతో పరిస్థితులు మారతాయని, టీఆర్‌ఎస్‌ పట్ల సానుభూతి రావచ్చని అంటున్నారు.

Tags :
|
|

Advertisement