Advertisement

శాకాహారంతో ప్రోటీన్స్ అందవా?

By: Dimple Thu, 16 July 2020 3:06 PM

శాకాహారంతో ప్రోటీన్స్ అందవా?


రోగనిరోధక శక్తి పెరగడానికి ప్రొటీన్స్‌ బాగా ఉపయోగపడతాయి. మనదేశంలో మాంసాహారం తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువ. శాకాహారులే ఎక్కువ. వెజిటేరియన్‌ ఫుడ్‌లోనూ ప్రొటీన్స్‌ లభిస్తాయి. పప్పు దినుసుల్లో 25 శాతం వరకు ప్రొటీన్స్‌ ఉంటాయి. కాబట్టి శాకాహారులు ప్రతిరోజూ ఆహారంలో పప్పు దినుసులు ఉండేలా చూసుకోవాలి. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ/దోశె, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాల్లో కూడా పప్పు దినుసులు ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఒక పూట ఆకుకూర పప్పు ఉంటే మరోపూట పొట్టు తీయని పప్పుదినుసులతో కాయగూరలు కలిపి వండుకోవాలి. ఈ విధంగా ఆహారంలో పప్పు దినుసులను భాగంగా చేసుకుంటే ప్రొటీన్‌ లోపం ఏర్పడకుండా ఉంటుంది.

పప్పు వల్ల ఏర్పడే గ్యాస్నివారణ ఎలా?

పప్పు తింటే గ్యాస్‌ సమస్య వస్తుందని చాలా మంది దూరంగా ఉంటారు. అలాంటి వారు మొలకలను ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. పప్పును రాత్రి నానబెట్టి పగలు ఉపయోగించడం వల్ల గ్యాస్‌ సమస్య రాకుండా చూసుకోవచ్చు. నిమ్మరసం పిండుకోవడం వల్ల కూడా గ్యాస్‌ సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు సమపాళ్లలో తీసుకుంటే గ్యాస్‌ సమస్య ఏర్పడదు.

ప్రొటీన్స్అధికంగా లభించేవి

సోయాలో 40 శాతం ప్రొటీన్స్‌ ఉంటాయి. వారంలో రెండు మూడుసార్లు సోయా ఉత్పత్తులను తీసుకోవచ్చు. సోయా పాలు, సోయా పనీర్‌ లాంటివి తీసుకుంటే ఫలితం ఉంటుంది. సప్లిమెంట్ల రూపంలో శాకాహార ప్రొటీన్స్‌ దొరకుతాయి. వాటిని ఒక పద్దతి ప్రకారం, మోతాదు ప్రకారం వాడుకోవచ్చు. ప్రొటీన్స్‌ మనకు ఎన్నో రకాల పనులు చేసి పెడతాయి. హార్మోన్స్‌ సమతుల్యత, కణాల ఉత్పత్తి, హీమోగ్లోబిన్‌ శాతం, ఎంజైమ్స్‌ తయారీ, కండరాల బలోపేతం, శరీరాన్ని రిపేర్‌ చేసుకోవడం వంటి పనులన్నింటికీ ప్రొటీన్స్‌ అవసరం. కాబట్టి ఆహారంలో ప్రొటీన్‌ లోపం లేకుండా చూసుకోవాలి.


Tags :
|
|

Advertisement