Advertisement

విప్లవ రచయితల సంఘం నేత వరవరరావుకి కరోనా

By: chandrasekar Fri, 17 July 2020 10:05 AM

విప్లవ రచయితల సంఘం నేత వరవరరావుకి కరోనా


ప్రస్తుతం ముంబయిలోని తలైజా జైలులో ఉన్న వరవరరావును కొద్ది రోజుల క్రితం చికిత్స నిమిత్తం జేజే ఆస్పత్రికి తీసుకెళ్లారు. తలోజా జైల్లో ఉన్నప్పుడు అతని ఆరోగ్యం విషమించింది. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం ముంబయిలోని జేజే ఆస్పత్రికి జైలు సిబ్బంది తీసుకెళ్లారు. అయితే అక్కడ కరోనా లక్షణాలు కనబడడంతో వెంటనే పరీక్షలు నిర్వహించారు. దీంతో వరవరరావుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో జేజే ఆస్పత్రి నుంచి సెయింట్ జార్జ్ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం ఆయన్ను తరలించారు.

ఇప్పటికే హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులు వెళ్లి వరవరరావును కలిశారు. అయితే వరవరరావు ఆరోగ్యం పైన ఇప్పటికే కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి వరవరరావు ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళన కరంగా ఉందని అతనికి వెంటనే మెరుగైన చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇప్పుడు కరోనా సోకడంతో అతని పరిస్థితి మరింత విషమంగా మారింది. ప్రస్తుతానికి అతని ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.

మావోయిస్టులతో కలిసి ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారన్న అభియోగంపై విరసం నేత వరవర రావు దాదాపు ఏడాదిన్నరగా జైల్లో ఉన్నారు. వరవర రావుతో పాటు మరో నలుగురిని పుణె పోలీసులు 2018 ఆగస్టులో అరెస్టు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో కొన్ని రోజులు వీరిని గృహ నిర్బంధంలో ఉంచిన అధికారులు, ఆ తర్వాత మళ్లీ జైలుకు తరలించారు. వరవర రావును మొదట్లో పుణెలోని ఎరవాడ జైలులో ఉంచారు. తర్వాత అక్కడి నుంచి కొన్నాళ్ల కిందట నవీన ముంబయిలోని తలోజా జైలుకు ఆయన్ను తరలించారు. ఈ క్రమంలోనే ఆయన కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ముంబయిలోని జేజే ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Tags :
|

Advertisement