Advertisement

కరోనా వల్ల కంటి చూపు కోల్పోయిన ఓ బాలిక...!

By: Anji Wed, 21 Oct 2020 11:19 AM

కరోనా వల్ల కంటి చూపు కోల్పోయిన ఓ బాలిక...!

కరోనా మహమ్మారి కొత్త సమస్యలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడిన వారిలో ఊపిరితిత్తులు, గుండె పనితీరుతో పాటు మెదడుపైనా ప్రభావం పడినట్లు చాలా కేసుల్లో తేలింది. తాజాగా కంటి చూపు కోల్పోయిన కేసు దేశ రాజధాని ఢిల్లీలో నమోదైంది.

కరోనా వైరస్ మెదడుపై ప్రభావం చూపడం వల్ల అదనపు సమస్యలు తలెత్తుతున్నట్లు ఎయిమ్స్‌ వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ బారినపడిన పదకొండేళ్ల ఓ బాలిక పాక్షికంగా కంటి చూపు కోల్పోయినట్లు ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు.

మెదడులోని సున్నితపైన నాడీ కణాలపై వైరస్‌ దాడి చేయడం వల్ల ఇలా జరిగిందని వివరించారు. దేశంలోనే ఇది తొలి కేసు అయుండొచ్చని వారు పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం కొనసాగుతోందని తెలిపారు. కరోనా సోకకముందు తమ బిడ్డకు ఎలాంటి కంటి సమస్యలూ లేవని ఆమె తల్లిదండ్రులు చెప్పారు.

తమ కుమార్తెకు కళ్లు సరిగ్గా కనిపించడం లేదంటూ 11 ఏళ్ల బాలికను ఆమె తల్లిదండ్రులు హాస్పిటల్‌లో చేర్పించారు. MRI స్కాన్‌‌ ద్వారా యాక్యూట్‌ డిమైలినేటింగ్‌ సిండ్రోమ్‌ (ఏడీఎస్‌) లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.

దీని ఆధారంగా కరోనా వైరస్‌ ప్రభావం మెదడుపైనా ఉందని నిర్ధారించారు. సదరు బాలికకు కరోనా సోకినప్పటి నుంచి ఎలాంటి ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నది అనే అంశంపై ప్రత్యేక రిపోర్టు తయారు చేస్తున్నారు.

చికిత్స అనంతరం ఆ అమ్మాయికి 50 శాతం చూపు తిరిగి వచ్చిందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు. ఇమ్యూనోథెరపీ ద్వారా ఆమెకు చికిత్స అందించినట్లు చెప్పారు. బాలికను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసినట్లు తెలిపారు.

ఏడీఎస్‌ ప్రభావంతో నాడీ కణాల్లోని మెయిలిన్‌ తొడుగు నాశనం అవుతుంది. దీనివల్ల మెదడు పంపించిన సంకేతాలు శరీర భాగాలకు సరిగా చేరక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు.

మరో 13 ఏళ్ల బాలికకు తీవ్ర జ్వరం, మెదడులో వాపు సమస్య ఉందని ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. ఆమె కూడా కొన్ని రోజుల కిందట కరోనా బారినపడిందని తెలిపారు. ఈ కేసుపైనా లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags :
|
|
|

Advertisement