Advertisement

  • ప్రశాంత్ నీల్ తరువాత సినిమాలో హీరో ఎవరు...?

ప్రశాంత్ నీల్ తరువాత సినిమాలో హీరో ఎవరు...?

By: chandrasekar Tue, 13 Oct 2020 5:53 PM

ప్రశాంత్ నీల్ తరువాత సినిమాలో హీరో ఎవరు...?


దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన దర్శకుల్లో దక్షిణాది దర్శకులు శంకర్, రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీల్ ఒకరు. అంతకు ముందు మణిరత్నం కూడా తన సినిమాలతో ఆల్ ఇండియా ప్రేక్షకులను తన సినిమాలతో అలరించారు. ఒకపుడు ఆదుర్తి సుబ్బారావు, దాసరి, రాఘవేంద్రరావు, బాపయ్య వంటి చాలా మంది తెలుగు దర్శకులు హిందీ సినిమాలను డైరెక్ట్ చేసి తమ సత్తా చాటారు. మలయాళం నుంచి ప్రియదర్శన్ కూడా హిందీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి ఎపుడైతే బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా మూవీ చేసి దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. జక్కన్న కూడా బాహుబలికి అన్ని భాషల్లో ఈ రకంగా రెస్పాన్స్ వస్తుందని కూడా ఊహించలేదు. అంతేకాదు ఒక ప్రాంతీయ భాష చిత్రం హిందీలో దాదాపు రూ. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం బాలీవుడ్ మేధావులను సైతం ఆశ్యర్యపోయేలా చేసింది.

ఒకవైపు రాజమౌళి బాహుబలి వంటి సినిమాతో బాలీవుడ్ చిత్ర సీమను శాసిస్తుంటే మరోవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్ యశ్ వంటి అప్ కమింగ్ హీరోతో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో ‘కేజీఎఫ్’ సినిమా తెరకెక్కించి అద్భుతమైన విజయం సాధించాడు. అంతకు ముందు ప్రశాంత్ నీల్ కేవలం ఒకే ఒక సినిమాను తెరకెక్కించాడు. కేజీఎఫ్ సినిమా కూడా ఎవరు ఊహించని విధంగా కన్నడతో పాటు తెలుగులో హిందీలో ఓ రేంజ్‌లో ఇరగదీసింది. అంతేకాదు ఈ సినిమా బాలీవుడ్‌లోనే ఏకంగా రూ. 125 కోట్ల వరకు కొల్లగొట్టింది. తెలుగులో రూ. 3 కోట్ల లోపు బిజినెస్ చేసిన ఈ సినిమా మొత్తంగా రూ. 25 కోట్ల వరకు కొల్లగొట్టి అందరి ఆశ్యర్యపోయేలా చేసింది. అంతేకాదు కన్నడ చిత్రపరిశ్రమలో తొలి రూ.100 కోట్లు, తొలి రూ. 200 కోట్ల సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ చిత్రంతో హీరోగా యశ్‌తో పాటు దర్శకుడిగా ప్రశాంత్ నీల్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయారు.

ఇపుడు ఇతను యశ్‌తో ‘కేజీఎఎఫ్ 2’ పార్ట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూసేలా చేసాడు. రెండో పార్ట్‌లో సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ నటీనటులు నటిస్తుండటం విశేషం. కరోనా లాక్‌డౌన్ తర్వాత రీసెంట్‌‌గా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. ఈ సీక్వెల్ కోసం కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు అభిమానులు. దీనికి సంబంధించిన షూటింగ్ మళ్లీ మొదలైంది. అక్టోబర్ 8న యశ్ షూటింగ్‌లో అడుగుపెట్టాడు. కేజీఎఫ్ 2 షూటింగ్‌లో యశ్‌కు సలహాలు ఇస్తున్న ప్రశాంత్ నీల్ ఐతే రీసెంట్‌గా ట్విట్టర్‌లో చేసిన చిట్‌చాట్‌లో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ తెలుగులో చేయనున్నట్టు ప్రకటించాడు. ఐతే ముందుగా ఎన్టీఆర్, ప్రభాస్ ఎవరితో చేస్తాడనేదానికి ముందుగా కేజీఎఫ్ 2 కంప్లీటైన తర్వాత అఫీషియల్‌గా ప్రకటిస్తానని చెప్పాడు.

కన్నడ చిత్ర సీమలో పుట్టన్న కనగల్, గిరీష్ కాసరవల్లి, ఎస్వీ రాజేంద్ర సింగ్ బాబు తర్వాత ఆ రేంజ్‌లో ఫేమసైన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒకరు. కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ వరుసగా తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి కమిటయ్యాడు. ముందు ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం కూడా కేజీఎఫ్ తరహాలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు సమాచారం. కేజీఎఫ్ తర్వాత ముందుగా ఎన్టీఆర్‌తో చేసే అవకాశాలున్నాయి. ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్, త్రివిక్రమ్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్‌తో చేసే అవకాశాలున్నాయి. ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే చిత్రాన్ని స్వాతంత్య్రం తర్వాత భారత్- పాకిస్థాన్ విడిపోయిన కాలం నాటి నుంచి ఆ తర్వాత భారత్, పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ యుద్ధంలో మన భారత యోధులు ఏ విధంగా పోరాటం చేసారనే ఇతివృత్తంతో తెరకెక్కబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నారు. మరోవైపు ప్రభాస్‌తో కూడా ప్రశాంత్ నీల్ నెక్ట్స్ మూవీ ఉండే అవకాశాలున్నాయి.

నాగ్ అశ్విన్, ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాల తర్వాత ప్రభాస్ చిత్రాన్ని ఇతనే డైరెక్ట్ చేస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై రానటువంటి డిఫరెంట్ సబ్జెక్ట్‌తో తెరకెక్కనున్నట్టు సమాచారం. వీళ్లిద్దరి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా ఓ చిత్రం చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల కథనం. మొత్తంగా కేజీఎఫ్ తర్వాత దర్శకుడిగా ప్రశాంత్ నీల్ ఖ్యాతి మరింత పెరిగింది. ఈ టాలెంటెడ్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ తెలుగు హీరోలతో సినిమాలు చేయడాన్ని కన్నడ ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ శంకర్, రాజమౌళి వాళ్ల భాషలో ఉన్న హీరోలతో సినిమాలు తెరకెక్కించి ఫేమస్ అయ్యారు. అలాగే ప్రశాంత్ నీల్ కూడా కన్నడ హీరోలతోనే సినిమాలు తెరకెక్కించాలని పట్టుపడుతున్నారు. మొత్తంగా ప్రశాంత్ నీల్ ఇపుడు కన్నడ డైరెక్టర్ కాదు. రాజమౌళి లెవల్లో ప్యాన్ ఇండియా లెవల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.


Tags :

Advertisement