Advertisement

  • 'మర్డర్' సినిమాకు తాత్కాలికంగా బ్రేక్...హైకోర్టుకు వెళతామంటూ వర్మ తరఫు న్యాయవాది

'మర్డర్' సినిమాకు తాత్కాలికంగా బ్రేక్...హైకోర్టుకు వెళతామంటూ వర్మ తరఫు న్యాయవాది

By: chandrasekar Tue, 25 Aug 2020 6:13 PM

'మర్డర్' సినిమాకు తాత్కాలికంగా బ్రేక్...హైకోర్టుకు వెళతామంటూ వర్మ తరఫు న్యాయవాది


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న 'మర్డర్' సినిమా విడుదలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు. మర్డర్ మూవీపై విడుదలకు ముందే వివాదం రాజుకుంటున్న సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో ఆనంద్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యోదంతం ఆధారంగా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ప్రణయ్ భార్య అమృత, తండ్రి బాలస్వామి కోర్టును ఆశ్రయించారు.

తమ కుటుంబాన్ని సంప్రదించకుండా ఫొటోలు, పేర్లు వాడుకుంటున్నారంటూ.. అలాగే ప్రశాంతంగా ఉన్న తమ బ్రతుకులను వర్మ బజారుకీడ్చే ప్రయత్నం చేస్తున్నాడంటూ వర్మపై, మర్డర్ మూవీపై కంప్లైంట్ చేశారు. అదేవిధంగా హత్యకేసు విచారణ ఉన్న ఈ దశలో కల్పిత కథతో ఇలాంటి సినిమా వచ్చిందంటే అది సాక్షులపై వ్యతిరేక ప్రభావం పడే ఛాన్స్ ఉందని వారు పేర్కొన్నారు.

నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ పిటిషన్ పరిశీలించి మర్డర్ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ కేసు విషయమై హైకోర్టుకు వెళతామంటూ వర్మ తరఫు న్యాయవాది తెలిపారు. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్‌టైన్మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై నట్టి కరుణ, నట్టి క్రాంతి ఈ మర్డర్ సినిమాను నిర్మిస్తున్నారు.

Tags :
|
|

Advertisement