Advertisement

  • తెలుగు రీమేక్‌లో సత్యదేవ్, తమన్నాహీరోహీరోయిన్లు

తెలుగు రీమేక్‌లో సత్యదేవ్, తమన్నాహీరోహీరోయిన్లు

By: chandrasekar Thu, 16 July 2020 6:59 PM

తెలుగు రీమేక్‌లో సత్యదేవ్, తమన్నాహీరోహీరోయిన్లు


సత్యదేవ్ ప్రతిభావంతుడైన నటుడని, ఆయనతో కలిసి స్క్రీన్‌పై మ్యాజిక్ క్రియేట్ చేయడానికి వేచిచూస్తున్నానని తమన్నా వెల్లడించారు. కన్నడ సూపర్ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు మంగళవారం అధికారిక ప్రకటన వచ్చింది. ఈ తెలుగు రీమేక్‌లో యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. నాగశేఖర్ దర్శకత్వం వహించనున్నారు. ఆయనే నిర్మాత కూడా. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా తమన్నా, సత్యదేవ్, నాగశేఖర్ స్పందించారు.

హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ ‘‘చాలా మంది తెలుగు నిర్మాతలు, దర్శకులు తిరిగి నిర్మించడానికి అమితాసక్తి చూపిన ఇలాంటి సినిమాలో నేను నటిస్తుండటం గౌరవంగా భావిస్తున్నాను. సత్యదేవ్‌లో గొప్ప ప్రతిభ ఉంది. తరవాత తరం నటుడు సత్యదేవ్. ఆయనతో కలిసి స్క్రీన్ మీద మ్యాజిక్ క్రియేట్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ‘లవ్ మాక్‌టైల్’ ఇప్పటి వరకు మనం చూడని కథ మాత్రమే కాదు. జీవితంలోని మధుర క్షణాలను మన ముందు ఉంచుతుంది. రొమాన్స్, గతవ్యామోహానికి నేను వీరాభిమానిని. అందుకే, ఈ సినిమా నన్ను ఎంతగానో ఆకర్షించింది’’ అని వెల్లడించారు.

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ‘‘ఒక పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంలో నేను నటిస్తుండటం నా కెరీర్‌లోనే తొలిసారి. ఎంతో లోతైన భావోద్వేగాలు కలిగిన కుర్రాడి పాత్రను నేను పోషించబోతున్నాను. అందుకే, చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. తమన్నా చాలా మంచి నటి. ఆమెతో తెరను పంచుకోబోతుండటం చాలా సంతోషం. కన్నడ సినీ పరిశ్రమలో నాగశేఖర్‌కు మంచి గుర్తింపు ఉంది. ఆయన తెలుగు స్క్రిప్ట్‌ను ఇంకా ఫ్రెష్‌గా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు’’ అని తెలిపారు.

ఇక ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమవుతోన్న దర్శక నిర్మాత నాగశేఖర్ మాట్లాడుతూ ‘‘కన్నడలో ఆరు, తమిళంలో రెండు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన తర్వాత మొత్తానికి తెలుగులో పరిచయం అవుతున్నాను. కన్నడ కథలోని మెయిన్ కాన్సెప్ట్‌ను మాత్రమే తీసుకుంటున్నాం. దాన్ని తెలుగు ఆడియన్స్‌కు నచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నాం’’ అని చెప్పారు. ఈ సినిమాను భావన రవితో కలిసి నాగశేఖర్ నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం సమకూరుస్తున్నారు. సత్య హెగ్డే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో షూటింగ్‌ను ప్రారంభిస్తారు.

Tags :
|

Advertisement