Advertisement

  • ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రపై రాజమౌళి తీపి కబురు

ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రపై రాజమౌళి తీపి కబురు

By: Dimple Sun, 23 Aug 2020 11:29 PM

ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రపై రాజమౌళి తీపి కబురు

‘మా అన్న మన్నెందొర అల్లూరి సీతారామరాజు’ అంటూ గంభీరమైన వాయిస్‌తో ‘ఆర్‌ఆర్ఆర్‌’లో రామ్‌చరణ్‌ పాత్రను పరిచయం చేశారు ఎన్టీఆర్‌. చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన టీజర్‌ అభిమానులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా చిత్ర బృందం నుంచి కచ్చితంగా సర్‌ప్రైజ్‌ వస్తుందని అంతా ఆశించారు. కానీ, కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా టీజర్‌కు సరిపోయే సన్నివేశాలను చిత్రీకరించలేకపోవడంతో తారక్‌ అభిమానులు నిరాశపడ్డారు. ఈ నేపథ్యంలో రాజమౌళి చెప్పిన తీపి కబురు ఎన్టీఆర్‌ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

తాజాగా ఓ టెలివిజన్‌ ఛానల్‌తో మాట్లాడుతూ.. ‘ఆర్‌ఆర్ఆర్‌’లో తారక్‌ లుక్‌, టీజర్‌పై స్పష్టత ఇచ్చారు. ‘‘పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్‌ వెళ్తాం. ఈ విషయంలో వైద్యుల సలహా తప్పకుండా తీసుకుంటాం. ‘ఏం పర్వాలేదు వెళ్లొచ్చు’ అని వారి నుంచి అభయం వస్తే పది, పదిహేను రోజుల్లో తారక్‌ లుక్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరించి, తారక్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ కథలో పాత్రలకు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ సరిగ్గా సరిపోతారని తనకు అనిపించింది కాబట్టే వారిని తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఏ బాలీవుడ్‌ నటులూ తన మదిలో లేరన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనుకున్న సమయానికి (జనవరి 8, 2021) రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ‘బాహుబలి’ నుంచి తాను తీసే ప్రతి సినిమా భాషతో సంబంధం లేకుండా ఒక ఇండియన్‌ ఫిల్మ్‌గా తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇక తన కలల ప్రాజెక్టు ‘మహాభారతం’ తీయాలంటే 10ఏళ్లు పైనే పట్టవచ్చని తెలిపారు. ‘ఆర్‌ఆర్ఆర్‌’లో అలియాభట్‌, ఓలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.

Tags :
|
|

Advertisement