Advertisement

భారీగా పతనం అయిన స్టాక్ మార్కెట్లు

By: Sankar Thu, 15 Oct 2020 5:07 PM

భారీగా పతనం అయిన స్టాక్ మార్కెట్లు


దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కుప్పకూలాయి. ఆరంభంలో పాజిటివ్‌గా ఉన్న సూచీలు ప్రపంచ మార్కెట్లు బలహీనత, ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలతో వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. తద్వారా అక్టోబర్‌ సిరీస్‌లో తొలిసారిగా మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. మెటల్ తప్ప అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ముగిసాయి.

ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లు మార్కెట్లను దెబ్బతీశాయి. నిఫ్టీ బ్యాంకు ఏకంగా 1000 పాయింట్లకు పైగా పతనమైంది. దీంతో గత పదిరోజుల లాభాలు తుడిచి పెట్టుకుపోయాయి. సెన్సెక్స్ 1066 పాయింట్లు నష్టంతో 39728వద్ద, నిఫ్టీ 291 పాయింట్లు పతనమై 11680 వద్ద ముగిసాయి. ఫలితంగా సెన్సెక్స్ 40 వేల దిగువకు, నిఫ్టీ 11700 దిగువకు చేరాయి. అంతేకాదు సుమారు రూ.3.3 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయినట్టు మార్కెట్లు గణాంకాల అంచనా.

ప్రధానంగా రిలయన్స్, ఐసీఐసీఐ, కోటక్, బంధన్, ఇండస్ ఇండ్, భారతి ఎయిర్ టెల్, టెక్ మహీంద్ర, బజాజ్ ఫైనాన్స్, మైండ్ ట్రీ, హెచ్‌సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ భారీగా నష్టపోయాయి. మరోవైపు, టాటాస్టీల్, హీరో మోటో కార్ప్, హిండాల్కో, జెఎస్‌డబ్ల్యు స్టీల్‌ స్వల్పంగా లాభపడ్డాయి. యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విజృంభణ, తిరిగి లాక్ డౌన్ ఆందోళనలు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసినట్టు విశ్లేషకులు పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement