Advertisement

ఉద్యోగ నియామకాలపై కరోనా కాటు

By: Sankar Wed, 10 June 2020 09:02 AM

ఉద్యోగ నియామకాలపై కరోనా కాటు


దేశంలో ఉపాధి అవకాశాలను కరోనా దెబ్బతీసింది. ముఖ్యంగా మే నెలలో లాక్‌డౌన్‌ కారణంగా నియామకాలు 61 శాతం పడిపోయాయి. ఏప్రిల్‌ తర్వాత మే నెలలోనూ ఇదే పరిస్థితులు కొనసాగాయి. 2019 మే నెలలో 2,346 నియామకాలు చోటు చేసుకోగా.. ఈ ఏడాది మే నెలలో 910 నియామకాలు నమోదయినట్టు నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ తెలిపింది.

నౌకరీ డాట్‌ కామ్‌ పోర్టల్‌లో ఉద్యోగ నోటిఫికేషన్ల నమోదు ఆధారంగా ఈ సంస్థ నెలవారీగా నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ గణాంకాలను విడుదల చేస్తుంటుంది. మే నెలలో హోటల్‌ రంగంలో 91%, రెస్టారెంట్‌ రంగంలో 87%, ఆటో, ఆటో విడిభాగాల రంగంలో 76%, బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలో 70% మేర నూతన నియామకాల్లో క్షీణత కనిపించింది. కోల్‌కతా నగరంలో 68 శాతం, ఢిల్లీలో 67 శాతం, ముంబైలో 67 శాతం మేర నూతన ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. ప్రారంభ స్థాయి ఉద్యోగ అవకాశాల్లో 66 శాతం తగ్గుదల నమోదైంది.

దేశ ఉద్యోగ మార్కెట్లో నిరాశావహ పరిస్థితులు నెలకొన్నాయని.. వచ్చే మూడు నెలల కాలంలో (జూలై–ఆగస్ట్‌ త్రైమాసికంలో) మరింత మంది ఉద్యోగులను నియమించుకునే విషయంలో 5 శాతం కంపెనీలే సానుకూలంగా ఉన్నట్టు మ్యాన్‌పవర్‌ గ్రూపు ఎంప్లాయింట్‌మెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే స్పష్టం చేసింది.

Tags :
|
|

Advertisement