Advertisement

జుట్టుకు నూనె రాసేప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి ..

By: Sankar Thu, 06 Aug 2020 5:04 PM

జుట్టుకు నూనె రాసేప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి ..



నిగనిగలాడే కురులు అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా సూచికలే. ఇటీవలి కాలంలో జుట్టు రాలే సమస్య ఉన్నవాళ్లు ఎక్కువగా ఉంటున్నారు. దీనికి పోషకాల లోపం, ఇతర ఆరోగ్య సమస్యలు ఒక కారణమైతే, జుట్టుకు నూనె రాసే విధానం కూడా మరో కారణం అవుతున్నది. అందుకే జుట్టుకు నూనె రాసేప్పుడు ఈ కింది జాగ్రత్తలు పాటించాలి..

1. వెంట్రుకలు చాలా సున్నితమైనవి. అతిగా రుద్దడం వల్ల అవి తొందరగా తెగిపోయి, రాలిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల నూనె రాసేటప్పుడు వెంట్రుకలను తలపై చర్మాన్ని మృదువుగా వలయాకారంలో నిమిరుతున్నట్టుగా రుద్దాలి. ఇలా నూనెతో మర్దన చేయడం వల్ల వెంట్రుకలకు బలం చేకూరి బాగా పెరుగుతాయి.

2. స్నానం చేసిన వెంటనే వెంట్రుకల తడి ఆరకముందే నూనె రాయడం మంచిది కాదు. వెంట్రుకల మొదళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. తడిగా ఉన్నప్పుడు కొంచెం ఒత్తిడికి కూడా రాలిపోయేంత సున్నితంగా తయారవుతాయి. అందువల్ల తడిజుట్టుకు నూనె రాస్తే త్వరగా రాలిపోతాయి. అందుకే పూర్తిగా తడి ఆరిన తరువాతే నూనె రాయాలి.

3. నూనె రాయమంటే జుట్టు కుదుళ్లకే పట్టించడం మనకు అలవాటు. వెంట్రుకలకు రాసినప్పటికీ వాటి చివర్లను పెద్దగా పట్టించుకోం. కాని చివర్లకు సరైన పోషణ లేకపోతే అవి చిట్లిపోతాయి. తద్వారా వెంట్రుకల పెరుగుదల దెబ్బతింటుంది. జుట్టు రాలిపోవడానికి ఇది కూడా కారణమవుతుంది. అందుకే జుట్టు మొదళ్లలోనే కాదు, చివర్లకు కూడా నూనె రాయాలి. ..

4.తలకు రాసుకునే నూనె అనగానే ఎవరికైనా కొబ్బరినూనె మాత్రమే గుర్తుకు వస్తుంది. కాని ఈ నూనెల్లో కూడా చాలా రకాలున్నాయి. కొబ్బరి నూనె పోషణకు మంచిది. బాదం నూనె వెంట్రుకల పెరుగుదలకు దోహదపడుతుంది.

5. శికాకాయ నూనెలు కూడా వివిధ రకాల జుట్టుకు సరైన పోషణ ఇస్తాయి. డాక్టర్‌ సలహా మీదట మీ జుట్టు రకానికి సరిపడే నూనెను ఎంచుకోవడం మేలు.

Tags :
|
|
|

Advertisement