Advertisement

శివ శంకరుని ఆరాధన..

By: chandrasekar Thu, 18 June 2020 7:31 PM

శివ శంకరుని ఆరాధన..


శివ శంకరుని అర్చించడం వల్ల నాలుగు విధాలైన ప్రయోజనాలు సిద్ధిస్తాయని, ఆ నాలుగూ తనకు శివార్చనలో సిద్ధించడం వల్ల తాను కృతార్థుడనయ్యానని అన్నారు ఆదిశంకరాచార్యుల వారు ‘శివానందలహరి’లో. ఆ నాలుగు ప్రయోజనాలు: సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుజ్యం. శంకరునుని లేదా ఏ దేవతనైనా ఆరాధించాలంటే ఆ దేవతారూపంతో తాదాత్మ్యతను పొందాలి. ‘నా రుద్రో రుద్రమర్చయేత్‌'. ‘రుద్రుడు కానివాడు రుద్రుని ఆరాధించలేడు’ అంటారు.

‘భ్రమరకీట న్యాయం’ ప్రకారం, రుద్రుని భావించడం వల్ల రుద్రరూపాన్ని పొందగలుగుతాం. రుద్రరూపాన్ని పొందడం అంటే రుద్రుని తత్త్వాన్ని అర్థం చేసుకోవడం, ఆ తత్త్వంతో మమేకమవడం. ‘శివత్వాన్ని పొందడం’ అంటే నిరంతర ఆనందభావనలలో క్రీడించడం. దానికి కావలసింది ముందుగా మన ఆరాధ్యదేవతను త్రికరణశుద్ధిగా నమ్మాలి. ఆ దేవత అనంతత్త్వాన్ని, సర్వశక్తిమయతను, సర్వ జ్ఞత్వాన్ని, సర్వవ్యాపకతను ‘ఎఱుక‘ పరుచుకోవాలి. ఆ తత్త్వాలను అవగాహన చేసు కొని దగ్గరగా దర్శించగలిగిన ‘తెలివి’ని పొందాలి. రూపా న్నెంత స్పష్టంగా దర్శించగలిగి తే అంతగా సాన్నిహిత్యాన్ని పెంచుకోగలుగుతాం. ఆ మేరకు లక్ష్యాన్ని చేరు కోగలుగుతాం. ‘శివా, మహా దేవా!‘ అంటూ శంకరనామ సంకీర్తన చేసేటప్పుడు, శివభక్తులతో సంబంధాలను పెంచుకునేటప్పుడు ఆ శంకర సామీప్యాన్ని పొందగలుగుతాం. మనకెంతమంది తెలుసనేది కాదు, ఎంతమందితో సాహచర్యం ఉంది, ఎందరితో పటిష్ఠమైన సంబంధాలను పెట్టుకున్నాం, ఎందరి కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్నామనేదే మన లక్ష్యసాధనలో ముఖ్యభూమిక వహిస్తుంది.

సంకీర్తనవల్ల తాదాత్మ్యత కలుగుతుంది. చైతన్యానికి చేతన కలిగి, శక్తి ఉత్తేజితమవుతుంది. దాంతో ఆ భావనకు సమీపంలో నిలువగలుగుతాం. ‘దేని సమీపానికైనా మనం వెళ్ళాలి’ అంటే, ముందు మనం అందుకు తగ్గ అర్హతను సాధిం చాలి. ఆ అర్హత సంకీర్తనవల్ల కలుగుతుంది. నారద భక్తిసూత్రాలలో ‘సంకీర్త్యమానః శీఘ్ర మేవ ఆవిర్భవతి, అనుభవా యేతి భక్తాన్‌' అంటాడు. సంకీర్తన వల్ల చాలా త్వరగా కలిగే అనుభవమే ‘సామీప్య స్థితి’ అంటారు. ‘చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని‘ అంటూ పోతనామాత్యుడు ఎంత తాదాత్మ్యతతో సంకీర్తించాలో తెలియజెప్పారు. ఇక, సాలోక్యం. తన్మయాతీతమైన స్థితి శంకరుని ఆవాసం. అదే ఆనందమయ లోకం.

ఎందరో భక్తులు శివారాధనలో, ఉపాసనలో తన్మయత్వంలో ఆనందిస్తుంటారు. ఆ లోకంలోకి వెళ్లడమే సాలోక్యం. వారితో కలవడం, శంకరగాథలు వినడం, పాడటం వల్ల ఆ లోకాన్ని ఆవిష్కరించుకోగలుగుతాం. చివరగా ‘సృష్టి అంతటా తాను, తనలో సకల సృష్టి’ని చూడటమే ‘ఈశిత్వం‘ అంటారు. ఆ ఈశిత్వాన్ని కలిగినవాడు, భక్తులకు ఆ స్థితిని ఇవ్వగలిగినవాడు ఈశ్వరుడు. ఆ స్థితియే సాయుజ్యం. ఆ సాయుజ్యాన్ని పొందాలంటే శివుడిని దర్శించాలి, భావించాలి, ధ్యానించాలి, మనసులో నిలుపుకోవాలి, అప్పుడే సకల చరాచర సృష్టితో అనుబంధం ఏర్పడి అంతటా తానే అయిపోతాడు, తనలో సృష్టి అంతా నిలుస్తుంది.

సాయుజ్యానికే ‘కైవల్యం’ అనే మరోపేరు. చరాచరాత్మకమైన సమస్త ప్రపంచానికీ మూలరూపం పరమాత్మే. సృష్టిలో అంతర్భా గమైన మన రూపమూ పరమాత్మే. మనకు భిన్నం కాని విశ్వ స్వరూపమూ బ్రహ్మమే. ఆ బ్రహ్మమే మనందరిలో ఆత్మరూపంలో ఉండే ఈశ్వరుడు. ఆ ఈశ్వరస్థితిని సాధించడమే కైవ ల్యం లేదా సాయుజ్యం. అందుకే, ఆదిశంక రులు ‘కృతార్థోస్మి, అహం’ అని అన్నారు. అంటే, నేను ధన్యుడినయ్యానని చెప్పారు. మనమూ ఆ శంకరుని ఆరాధించి ధన్యులమవుదాం.


Tags :
|
|
|

Advertisement