Advertisement

శ్రీ కృష్ణాష్టమి యొక్క మహిమ...

By: chandrasekar Tue, 11 Aug 2020 2:02 PM

శ్రీ కృష్ణాష్టమి యొక్క మహిమ...

శ్రీకృష్ణ భగవానుని తమ హృదయాలలో నింపుకొని ఆరాధించే వారుకూడా ఆనందసీమలలో విహరిస్తుంటారు. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమిని సాధారణంగా ఒక పండుగ వలె జరుపుకుంటున్నాం. కానీ, నిజానికి దీనిని ‘భవిష్యోత్తర పురాణం’ ఒక గొప్ప వ్రతంగా అభివర్ణించింది. ఈ ‘వ్రతం’ చేసే పద్ధతి, దాని మహిమకూడా అందులో వివరంగా ఉంది. ‘జన్మాష్టమి వ్రతం’ నిజానికి శ్రీకృష్ణుని చేతనే మథురలో ప్రారంభమైందనీ ఆ పురాణం చెబుతున్నది.

కృష్ణుని జన్మదిన పండుగను దేవకీ వసుదేవులు కంసుని కారాగారంలో ఉండటం వల్ల జరుపుకోలేకపోయారు. కానీ, చాలా ఏండ్ల తర్వాత శ్రీకృష్ణుడు బృందావనం నుండి మథురకు వచ్చి కంసుని వధించి, తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను చెర విడిపించిన తర్వాత, వారి కోరిక మేరకు కృష్ణాష్టమి ఉత్సవాన్ని, వ్రతాన్ని ఆవిష్కరించినట్టు పౌరాణిక సాహిత్యం చెబుతున్నది. మథురలో దానిని ప్రారంభించమని దేవదేవుడు చెప్పడం, ఆ మేరకు దేవకీ వసుదేవులు మథుర వాసులందరితో కలిసి కృష్ణాష్టమి ఉత్సవాన్ని జరుపుకోవడం సంభవించాయి. ఆనాటి నుంచి ఈ వేడుక నిరంతరాయంగా కొనసాగుతూ కోట్లాది భక్తుల హృదయాలలో ఆనందాన్ని నింపుతున్నది.

‘కృష్ణాష్టమి ఉత్సవాన్ని, వ్రతాన్ని ఎనిమిదేండ్ల నుండి ఎనభై ఏండ్ల వయస్సున్న ప్రతి ఒక్కరూ విధిగా ఆచరించాలి. ఆ రోజు ఉపవాసం చేయాలి. పండ్లు పాలు తీసుకోవచ్చు. లేదా ధాన్యేతర పదార్థాలు తినవచ్చు. భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి వ్రతం చేసేవారికి శాంతి, సుఖం, పరమభాగ్యం నిశ్చయంగా కలుగుతాయి’ అని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ప్రకటించాడు. ఈ వ్రత మహిమవల్ల సంతానం, ఆరోగ్యభాగ్యాలు కలుగుతాయని, అంతేకాకుండా, త్రికరణ శుద్ధిగా ఈ వ్రతాన్ని చేసేవారికి వైకుంఠ ప్రాప్తి తథ్యమని కూడా ‘భవిష్యోత్తర పురాణం’ వెల్లడించింది.

కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొని రాత్రంతా జాగరణ చేసేవారికి సంసార భయమే ఉండదు. వారికి కలిభయం తొలగి పోతుందని ‘బ్రహ్మ పురాణం’ పేర్కొన్నది. ఈ వ్రతమహిమ ఎంత గొప్పదంటే, కృష్ణ చరితను ఒక్కసారి మనసారా వింటే చాలు, సమస్త పాపాలనుంచి విముక్తులమవుతామని ‘బ్రహ్మాండ పురాణం’ చెప్పింది. ‘రోహిణీ నక్షత్రయుక్త కృష్ణ జన్మాష్టమి వ్రతం’ జనులకు సమస్త పాపహరమని ‘విష్ణు పురాణం’ ఉద్ఘాటించింది. అలాగే, అగ్ని, పద్మ, స్కంద పురాణాలలో కూడా ఈ దివ్యవ్రత మహిమ ప్రస్తావన విస్తారంగా ఉన్నది.

Tags :
|
|

Advertisement