Advertisement

అతిథి మర్యాదతో అనేక ఫలాలు!

By: chandrasekar Sat, 20 June 2020 5:50 PM

అతిథి మర్యాదతో అనేక ఫలాలు!


భారతీయ సంస్కృతిలో అతిథి మర్యాదలకున్న స్థానం అద్వితీయం. గృహస్థులు అతిథుల కోసం ఎదురుచూసి, వారిని అన్న పానీయాలతో సంతృప్తిపరిచి, వారి ఆశీర్వాదాలు తీసుకునే సంప్రదాయం నేటిది కాదు. జీవుణ్ణి కూడా అతిథిగానే భావించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తున్నది. మనకు తెలియకుండానే ఈ శరీరంలోకి ప్రవేశిస్తాం. కనుక, మనం ఈ శరీరమనే గృహానికి అతిథులమని ఆధ్యాత్మికవేత్తలు గుర్తించారు. అందుకే, లభించిన దానితో తృప్తి పడటం, లేనిదానికి బాధపడటం వారికి తెలియదు. ‘అన్నం పెట్టేవాడు ఈశ్వరుడే’ అన్న విశ్వాసం మనది. ‘అంతా ఈశ్వరునిదే’ అన్న నమ్మకం కలిగినవారికి అతిథి మర్యాదలు ఒక లెక్కలోనివి కావు.

కఠోపనిషత్తులోకి చూస్తే అతిథి మర్యాదల వైశిష్ట్యం బోధపడుతుంది. ఉద్దాలకుడు తన కుమారుడైన నచికేతుణ్ణి గురుకులానికి పంపిస్తాడు. ఆశ్రమంలో అప్పటికి ఆచార్యుడు ఉండడు. మూడురోజుల తర్వాత ఆశ్రమానికి వచ్చిన గురువుకు నచికేతుని గురించి తెలియజేస్తారు.

ఆ మూడు రోజులు నచికేతుడు ఎలాంటి ఆహారాన్నీ స్వీకరించలేదు. ‘నచికేతుడు తన ఆశ్రమానికి అతిథిగా వచ్చినట్లు’ గుర్తించాడు ఆచార్యుడు. స్వయంగా సత్కరించడానికి పూనుకున్నాడు. ఈ సందర్భంలో ఆచార్యుడు పలికిన పలుకులు మన భారతీయ సంస్కృతిలో అతిథి మర్యాదలకు గల ప్రాధాన్యాన్ని తెలుపుతున్నాయి. ‘ఏ గృహస్థుని ఇంట్లో అతిథికి భోజనాది సత్కారాలు లభించవో ఆ గృహస్థుని ఆశలు నెరవేరవు. ఏ పనులు చేసి ఫలితం కోసం ఎదురుచూస్తున్నామో ఆ ఫలితాలు సిద్ధించవు. మనం ఎంత గొప్పవాళ్లమైనా, గొప్పగొప్ప సభల్లో పాల్గొన్నా, అనుకున్నవిధంగా కీర్తి లభించదు.

honoring,guests,may create,good,benefits ,అతిథి, మర్యాదతో, అనేక, ఫలాలు, భారతీయ సంస్కృతి


ఇతరులతో ఎంత ప్రియంగా మాట్లాడినా మనకు శుభం కలుగదు. ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా లాభం ఉండదు. బావులు, చెరువులు తవ్వించినా, తోటలు పెంచినా, ధర్మసత్రాలు కట్టించినా, ఆశ్రమాలు నిర్మించినా ప్రయోజనం లేదు. చివరికి తనకున్న సంతానం వల్ల, పశుసంపద వల్ల అందవలసిన ఫలం అందదు.

ఇంటికి వచ్చిన అతిథికి తప్పక తగినరీతిలో ఆతిథ్యం ఇచ్చి సత్కరించాలి’ అని ఆశ్రమవాసులకు ఆచార్యుడు చేసిన ఉపదేశం ఆలోచింపదగింది, అనుసరింపదగింది. మన ఇంటికి అతిథి రాగానే ‘ఊరూ, పేరడిగి అతణ్ణి ఇబ్బందుల పాలు చేయడం’ మర్యాద అనిపించుకోదు. అతనిని ఏ విధంగా గౌరవించాలో ఆచార్యుడు ఆశ్రమవాసులకు తెలియజేశాడు.

మొదట ఆసనం ఇవ్వాలి. అందుకు తగిన స్థలం చూపాలి. ఆ తర్వాత చేతులు, ముఖం, కాళ్లు కడుక్కోవడానికి తగినట్లు నీళ్లివ్వాలి. ఆ తర్వాతనే మాట్లాడటం మొదలుపెట్టాలి. ఇంటికి అతిథి రాగానే మాటల్లోకి దించరాదని దీన్నిబట్టి అర్థమవుతున్నది. కూర్చున్న తర్వాతనే కుశల ప్రశ్నలు వేయాలి. అతిథిని గౌరవించడంలో అలసత్వం చూపకుండా ఉండటమంటే ఇదే. పెద్దన ‘మనుచరిత్ర’లో దీనికి చక్కని దృష్టాంతం లభిస్తుంది. ‘ఆముక్త మాల్యద’లోను అతిథి మర్యాదల ప్రస్తావన కనిపిస్తుంది.

Tags :
|
|

Advertisement